కామారెడ్డి, మే 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రస్తుత కాలంలో చాలా మంది యువ జంటలు సాధారణంగా మ్యారేజ్ డే అనగానే అర్దరాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆనందంగా గడపడం, సంప్రదాయ కుటుంబాల్లో అయితే కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళిరావడం, ఇంకా కొందరైతే పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం, ఇదంతా మామూలే.. కానీ కామారెడ్డికి చెందిన ఓ దంపతులు వినూత్నంగా గత ఐదు సంవత్సరాలుగా తమ పెళ్ళిరోజు సందర్బంగా రక్తదానం చేస్తూ ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. వివరాలు…
కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్ నగర్ కాలనీ చెందిన పులారి సుజిత్ కుమార్ ఉమారాణి దంపతులు గడిచిన ఐదు సంవత్సరాలుగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ సమాజంలో రక్తదానం పట్ల ఇంకా అపోహలు తొలగిపోవడం జరగలేదని రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు రావడంలేదని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి బలహీనతలు అనారోగ్య సమస్యలు ఏర్పడడం జరగని అన్నారు.
సంవత్సరానికి ఆరోగ్యవంతమైన వ్యక్తులు నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని రక్తదానం చేసిన తర్వాత 28 రోజుల లోపుగా తిరిగి మన శరీరంలో ఆ రక్తం రావడం జరుగుతుందన్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచిన సుజిత్ కుమార్ ఉమారాణి దంపతులకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కేబిఎస్ రక్తనిధి ప్రతినిధులు జీవన్, వెంకటేష్, సంతోష్ పాల్గొన్నారు.