నిజామాబాద్, మే 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.
ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్ ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని జతల యూనిఫామ్ లను సిద్ధం చేశారు, ఇంకా ఎన్ని జతలు కుట్టాల్సి ఉంది, క్లాత్ మెటీరియల్ అందుబాటులో ఉందా, ప్రతిరోజూ సగటున ఎన్ని యూనిఫామ్ లను తయారు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి ముందే యూనిఫామ్ లు ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్ లు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్ లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలని, నిర్దిష్ట గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. యూనిఫామ్‌ల తయారీకి సంబంధించిన ప్రగతి నివేదికలను తనకు రోజువారీగా అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, డీఈఓ దుర్గాప్రసాద్, ఏపీడీ రవీందర్, ఎపిఎం రజిత తదితరులు ఉన్నారు.