కామారెడ్డి, మే 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్-1,2,3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు మూడు మాసాల పాటు శిక్షణ పొందుతున్న (54) మంది ఎస్సి అభ్యర్థులకు కలెక్టర్ స్టడీ మెటీరియల్ అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు సిలబస్‌ను ఆకళింపు చేసుకొని అందుకనుగుణంగా స్వతహాగా నోట్స్ తయారు చేసుకోవడంతో పాటు కరంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో సన్నద్ధం కావాలన్నారు. విజయాలు సాధించిన వారి స్ఫూర్తిని, ఇతరుల సహాయాన్ని తీసుకోవాలని, టెస్ట్ సిరీస్ రాస్తూ అనుభవం గడిరచి పరీక్షలకు హాజరు కావాలన్నారు.
లక్షల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని, నేను సాధించగలనా అన్న భయం, అనుమానం వీడి ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల దృక్పధంతో చదివితే లక్ష్యం చేరుకోగలుగుతారన్నారు. పరీక్షలు ఎంత క్లిష్టమైన సమర్థవంతగా ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలన్నారు. సాధించిన ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని హితవు చెప్పారు.
కార్యక్రమంలో ఎస్సి అభివృద్ధి అధికారి రజిత, సహాయ ఎస్సి అభివృద్ధి అధికారి వెంకటేష్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, టిఎన్జీఓ అధ్యక్షులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.