కామారెడ్డి, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పాక్స్ కేంద్రం ద్వారా రైతులకు 833 బస్తాల జీలుగు, 282 బస్తాల జనుము విత్తనాలను విక్రయించామని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాక్స్ కేంద్రానికి వచ్చిన జీలుగు, జనుము విత్తనాలను సోమవారం నుండి ఆన్ లైన్‌లో అమ్మకం మొదలుపెడతామన్న సమాచారాన్ని వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా కామారెడ్డి మండలంలోని గ్రామా రైతులకు ముందుగా సమాచారమందించామన్నారు.
అట్టి సమాచారం మేరకు రైతులందరూ ఉదయమే పాక్స్ కేంద్రానికి చేరుకొని విత్తనాల కొరకు వరుసలో నిలబడ్డారని ఆమె తెలిపారు. ఆన్ లైన్‌లో పర్మిట్ మరియు బిల్లు జనరేట్ చేయడానికి కొంత సమయం పట్టినందు వల్ల రైతులు క్యూ లైన్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. కాగా అదనంగా జీలుగు, జనుము విత్తనాలు కావాలని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టమని, రాగానే తెలియపరుస్తామని, రైతులు సంయమనం పాటించాలని భాగ్యలక్ష్మి కోరారు.