కామారెడ్డి, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ లో సాగుచేయుటకు 10,030 క్వింటాళ్ల జీలుగ, 2,362 క్వింటాళ్ల జనుము విత్తనాలు 80 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరాకు ఇండెంట్ పెట్టగా మొదటి విడతగా 5,200 క్వింటాళ్ల జీలుగ, 1,243 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని రైతులకు టోకెన్ పద్ధతిన సరిపడా విత్తనాలను అందజేస్తున్నామన్నారు.
కాగా రైతులు విత్తనాల కోసం క్యూ లైన్ లో నిలుస్తున్నారని, విత్తనాలు దొరకడం లేదని వచ్చిన వార్తకు స్పందించి వ్యవసాయాధికారులతో సమీక్షించి కామారెడ్డి పిఎసి లో అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేసి నాలుగు రోజులలో విత్తనాలు సరఫరా చేశామని, రైతులందరికీ అందరికి సాఫీగా విత్తనాలు అందాయని, తిరిగి క్షేమంగా వెళ్లారని కలెక్టర్ తెలిపారు. ఆరోపణలు వస్తుంటాయి, కానీ అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారని వస్తావా లెక్కలు మాదగ్గర ఉంటాయని అన్నారు.
గత సంవత్సరం కంటే ఈసారి అధికంగా విత్తనాలు సరఫరా కాగా త్వరలోనే అన్ని ప్రాంతాలలో ప్రణాళిక ప్రకారం రైతులకు అందజేస్తామన్నారు.ఎటువంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం పనిచేస్తున్నదని, వ్యవసాయ శాఖ సంచాలకుల వారు కూడా రైతులకు సరిపడా విత్తనాలను అందజేస్తామని చెప్పారని అన్నారు. రైతులు సంయమనం పాటించాలని, టోకెన్ వారీగా విత్తనాలు అందజేస్తామన్నారు. 104 మంది వ్యవసాయ విస్తరణాధికారులు తగు ఆదేశాలిచ్చామని, వారంతా క్షేత్ర స్థాయిలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు.
సరిపడా విత్తనాలు అందడం లేదని ఏమైనా ఇబ్బందులుంటే 728894556 నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో విత్తన సరఫరా జరుగుతున్నదని, విక్రయదారుని దగ్గర రిజిస్టర్ లో ప్రతిదీ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కల్తీ విత్తనాల వల్ల ఏ రైతు నష్టపోకుండా పోలీస్, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని, వారు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారన్నారు. విత్తనాలు ఏ కంపెనీ, ఏ బ్యాచ్ అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తున్నదని, రైతు నష్టపోతే చర్య తీసుకోవడానికి అవకాశముంటుందని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే సీడ్ యాక్ట్, పిడి ఆక్ట్ క్రింద కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు.
అకాల వర్షాల వల్ల ఇబ్బందులెదురైనా వ్యవసాయ, రెవిన్యూ, సహాకార శాఖలసిబ్బంది సమన్వయంతో కష్టపడి పనిచేయడం వల్ల జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలకు గాను 330 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశామనని, మరో 20 కేంద్రాలే మిగిలి ఉన్నాయని 2,3 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. గత యాసంగిలో ఈ నాటికి రైతులకు 270 కోట్లు చెల్లిస్తే ఈ యాసంగిలో ఇప్పటి వరకు 612 కోట్లు చెల్లించామన్నారు. ట్యాబ్ ఎంట్రీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నదని అన్నారు.
వరినాట్లు ప్రారంభమయ్యాయని, రైతు వేదికలో అందుబాటులో ఉండే అధికారుల సలహాలు, సూచలను, మెళకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.