నిజామాబాద్, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్ 9వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా పాటించాల్సిన నిబంధనల గురించి అభ్యర్థులు పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని సూచించారు. జూన్ 9వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాన్నం 1.00 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. అయితే, ప్రిలిమ్స్ పరీక్షకు బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఉదయం 9.00 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోనికి అనుమతిస్తారని, 10.00 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈసారి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లతో పాటు బయో మెట్రిక్ కాప్చర్ కోసం 160 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ప్రత్యేకంగా అదనపు ఇన్విజిలేటర్ లను సైతం నియమిస్తున్నామని అన్నారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, మ్యాథమేటికల్ టేబుల్‌లు, లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్, హ్యాండ్‌బ్యాగులు, జోలాలు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, లూజ్ షీట్‌లు వంటివి తీసుకురాకూడదని. ఆభరణాలు, ఇతర గాడ్జెట్‌లు/ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, రికార్డింగ్ సాధనాలు అనుమతించబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు షూస్ కాకుండా చెప్పులు ధరించి రావాలని సూచించారు. అభ్యర్థులు తమ వేళ్లపై బయోమెట్రిక్స్ రికార్డింగ్‌కు ఆటంకం కలిగించే మెహెందీ, తాత్కాలిక టాటూలు లేదా ఏదైనా అబ్స్ట్రక్టివ్ మెటీరియల్ కవర్లు కలిగి ఉండకూడదని సూచించారు.
హాల్ టికెట్ లో పొందుపర్చబడిన పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు ముందుగానే వెళ్లి పరిశీలించుకుంటే పరీక్ష రోజున గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని హితవు పలికారు. అభ్యర్థుల సహాయార్ధం హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాలలోనూ సీ.సీ కెమెరాల నిఘాలో ఎగ్జామ్స్ జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు నిబంధనలను తు.చ తప్పకుండా పాటింఛాలని సూచించారు. పరీక్షా సమయం ప్రారంభం నుండి ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుండి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా బయటకు వెళ్లేందుకు అనుమతించబడరని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లే ముందు, అభ్యర్థి ఓఎంఆర్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలని అన్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభించే ముందు ఓఎంఆర్ జవాబు పత్రం, ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌పై ముద్రించిన సూచనలను పరిశీలించాలని కలెక్టర్ హితవు పలికారు. నమూనా ఓఎంఆర్ షీట్‌ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచారని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
దీనివల్ల చివరి నిమిషంలో గందరగోళాన్ని నివారించడానికి, బబ్లింగ్ తదితర వాటి కోసం సూచనలు, పాటించాల్సిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి, మోడల్ ఓఎంఆర్ జవాబు పత్రం ఉపయోగపడుతుందన్నారు.
అభ్యర్థుల విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవద్దని, అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష హాల్ ఇన్విజిలేటర్ నుండి కూడా సమయాన్ని తెలుసుకోవచ్చని సూచించారు.