నిజామాబాద్, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల (జూన్) 9 న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్ల గురించి ఆయా శాఖల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో 12833 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రాయనుండగా, వారి కోసం 41 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు నియమించిన చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు పరిశీలించాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎంఎంలను ఏర్పాటు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు.
144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్నందున అభ్యర్థులు కనీసం రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్దతిలో జరుగుతుందన్నారు. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి పరీక్షా కేంద్రాలలోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, ఉదయం పది గంటలకు మెయిన్ గేట్లు మూసివేస్తారని తెలిపారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీచేసి లోనికి పంపించేందుకు వీలుగా మహిళా పోలీసు సిబ్బందిని సైతం కేంద్రాల వద్ద నియమించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు.
అభ్యర్థులు బయోమెట్రిక్ పద్ధతిన తమ గుర్తింపును నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, లేనిపక్షంలో అభ్యర్థుల పరీక్ష పత్రాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిగణలోకి తీసుకోదని స్పష్టం చేశారు. ఒకసారి పరీక్షా కేంద్రం లోనికి వచ్చిన అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు తిరిగి పరీక్షా సమయం ముగిసేంత వరకు బయటకు వెళ్లకూడదని సూచించారు.
అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, షూస్, ఎలక్ట్రానిక్ ఉపకారణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రీజినల్ కో ఆర్డినేటర్, చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, తదితరులు అందరు సమన్వయంతో పనిచేయాలని, పరీక్షల నిర్వహణపై వీరికి నిర్దేశిత తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పేర్కొనబడిన అంశాలను, నియమనిబంధనల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త రామ్మోహన్ రావు, డీఈఓ దుర్గాప్రసాద్, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, కలెక్టరేట్ పరీక్షల విభాగం పర్యవేక్షకుడు పవన్, పోలీస్, ఆర్టీసీ, రవాణా, వైద్యారోగ్య, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.