నిజామాబాద్, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించి పనులను పరిశీలించారు.
తరగతి గదులు, కిచెన్ షెడ్, నీటి సంపు తదితర చోట్ల కొనసాగుతున్న పనులను తనిఖీ చేసి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని పాఠశాలలను సందర్శిస్తూ, పనుల తీరును నిశితంగా పరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకునే సమయం నాటికి అన్ని పనులు పూర్తి చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని, పనులకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాలన్నారు.
ప్రతి పాఠశాలలో నీటివసతి, టాయిలెట్స్ తప్పనిసరి ఉండాలని, బడి ఆవరణను శుభ్రం చేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.