నిజామాబాద్, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా విశదపరిచారు.
పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో సబ్బండ వర్ణాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరందు, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తమ కట్టూ, బొట్టు, ప్రత్యేక వేషధారణలతో ఆవిష్కరింపజేశారు. చూడచక్కని నృత్య ప్రదర్శనలతో జానపద కళ ఔన్నత్యాన్ని చాటారు.
ఎవరికివారు చిన్నారులు పోటాపోటీగా చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రదర్శనలు ముగిసిన అనంతరం చిన్నారులను వేదికపైకి ఆహ్వానించి వారిని అభినందిస్తూ ప్రోత్సహించారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూకిరణ్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.