ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో గల సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. గత 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ సైతం ఇక్కడే జరిగిందని అన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను జగిత్యాలలో లెక్కించగా, ఈసారి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ ను ఒకే చోట సీ.ఎం.సీలోనే నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ వివరించారు.

ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ వివరించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 7 కౌంటింగ్‌ హాల్‌ లను ఏర్పాటు చేశామని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం కూడా ప్రత్యేకంగా కౌంటింగ్‌ హాల్‌ నెలకొల్పామని తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం 20 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయగా, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల కౌంటింగ్‌ కోసం 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.

అదేవిధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ కై 10 టేబుళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, మధ్యాహ్నం 3.00 గంటలకు కౌంటింగ్‌ పూర్తయ్యే అవకాశం ఉందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్‌ కు ఒక కౌంటింగ్‌ సూపర్వైజర్‌, ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్‌ కు ఒక కౌంటింగ్‌ సూపర్వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని వివరించారు.

ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోల్‌ అయిన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్‌ లో ఉంచుతూ, ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ కోసం 448 మందిని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం 70 మందిని కలుపుకుని మొత్తం 558 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించామని వివరించారు. వీరిలో 180 మంది కౌంటింగ్‌ సూపర్వైజర్లు, 190 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 188 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు.

ఈవీఎం ల ఓట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా, ఒక్కో రౌండ్‌ వారీగా లెక్కిస్తూ, ఫలితాలను వెల్లడిస్తామని, మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను కలుపుతూ పార్లమెంటు నియోజకవర్గం వారీగా కూడా ఫలితాలను ప్రకటిస్తామని అన్నారు. కాగా, అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్‌ సెంటర్‌ వద్దకు రావాలని కలెక్టర్‌ సూచించారు. తాము జారీ చేసిన ఎంట్రీ పాసులతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే, కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఏజెంట్ల మార్పునకు అవకాశం ఉండదని అన్నారు.

పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్‌ సెంటర్‌ లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను పూర్తి చేశామని, సిబ్బందికి అల్పాహారం, భోజనాలను కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కౌంటింగ్‌ సిబ్బందికి హితవు పలికారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ, అవసరమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »