నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్, లలిత్ కుమార్‌ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిపారు.
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్లను జూన్ 4వ తేదీన డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో లెక్కించనున్నారు. ఈ మేరకు కౌంటింగ్ సిబ్బందిని సెకండ్ ర్యాండమైజేషన్ ద్వారా ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఖరారు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు.
ర్యాండమైజెషన్ ద్వారా ఖరారైన జాబితాను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్న మైక్రో అబ్జర్వర్లకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపుపై శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా నిర్వర్తించాల్సిన విధులు, పాటించాల్సిన నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించారు.
మంగళవారం ఉదయం ఐదు గంటలకు మూడవ విడత ర్యాండమైజెషన్ పూర్తయిన మీదట ఆ జాబితా ఆధారంగా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, జగిత్యాల శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సిబ్బందిని కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోల్ అయిన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్ లో ఉంచుతూ, ఈవీఎం ఓట్ల కౌంటింగ్ కోసం 448 మందిని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 70 మందిని కలుపుకుని మొత్తం 558 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు.
వీరిలో 180 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 190 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 188 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ర్యాండమైజెషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఎన్‌ఐసీ అధికారి రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.