కామారెడ్డి, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జూన్ 9న నిర్వహించే గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆయన చీఫ్ సూపర్డెంట్లు,బయోమెట్రిక్ శిక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బయోమెట్రిక్ చేసే విధానంపై అధికారులతో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు.
జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4792 మంది అభ్యర్థులు జిల్లాలో పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. బయోమెట్రిక్ యంత్రాలు ఒక రోజు ముందు జిల్లాకు వస్తాయని, వాటిని పరీక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు 12 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, పర్యవేక్షకులను, రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అధికారులకు పరీక్షకు సంబంధించి సామాగ్రిని అందజేశారు.
పరీక్ష కేంద్రంలోకి వచ్చే మహిళ, పురుష అభ్యర్థులను తనిఖీ చేయుటకు పోలీస్ శాఖ ద్వారా తగిన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడిరచారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పరీక్షల రీజనల్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.