అభ్యర్థుల హాల్‌ టికెట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌ టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఐడెంటిఫికేషన్‌ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ నెల 09న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద అభ్యర్థుల హాల్‌ టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి, నిర్దేశిత అభ్యర్థులు మాత్రమే ఎగ్జామ్‌ సెంటర్లోకి ప్రవేశిస్తున్నారని నిర్ధారించడానికి వీలుగా ప్రతి కేంద్రం వద్ద 50 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ఐడెంటిఫికేషన్‌ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఐడెంటిఫికేషన్‌ అధికారులు 9 వ తేదీన తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 7.00 గంటలకే చేరుకొని చీఫ్‌ సూపరింటెండెంట్‌కు రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

సీఎస్‌ లతో సమన్వయం ఏర్పర్చుకుని ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన సహకారాన్ని అందించాలని హితవు పలికారు. ముఖ్యంగా నిజమైన అభ్యర్థులే పరీక్షకు హాజరవుతున్నారా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హాల్‌ టికెట్‌పై ఇటీవలి ఫోటో అతికించబడిరదా లేదా అన్నది జాగ్రత్తగా గమనించాలన్నారు. ఒరిజినల్‌ ఐడి ప్రూఫ్‌ (ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆధార్‌ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైనవి) తనిఖీ చేసి, హాల్‌ టిక్కెట్‌తో సరిపోల్చాలని, వాస్తవ అభ్యర్థినే పరీక్షకు హాజరవుతున్నట్లు నిర్ధారించాల్సి ఉంటుందన్నారు.

అభ్యర్థి ఎవరైనా సెల్‌ ఫోన్‌, బ్లూటూత్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను పరీక్షా కేంద్రం లోనికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే, క్రిమినల్‌ కేసు బుక్‌ చేయడంతో పాటు డిబార్‌ చేయబడతారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త రామ్మోహన్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, డీఐఈఓ రవికుమార్‌, విద్యాశాఖ పరీక్షల నియంత్రణ విభాగం సహాయ కమిషనర్‌ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »