కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏ, బి బ్లాకులు, ఎస్ ఆర్ కే డిగ్రీ కాలేజీ, వి ఆర్ కే డిగ్రీ కాలేజీ, ఆర్ కే డిగ్రీ కాలేజీ, వశిష్ట డిగ్రీ కాలేజీ, వశిష్ట జూనియర్ కాలేజీ లో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించి పరీక్ష నిర్వహణ తీరుతున్నలను నిశితంగా పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల హాజరు, అభ్యర్థుల తనిఖీ, హాజరు, మౌలిక వసతులను పరిశీలించి, నిర్ణీత సమయంలో ప్రశ్నా పత్రాల పంపిణీ చేశారా, ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 78.79 శాతం అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 4,797 అభ్యర్థులకుగాను 3,780 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,017 మంది గైర్ హాజరయ్యారని ఆయన తెలిపారు.
అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ మూడు రూట్ల ద్వారా ప్రశ్న పత్రాలు, ఇతర సామాగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగగా, పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓ.ఎం.ఆర్ షీట్లు, ఇతర మెటీరియల్‌ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి, పోలీస్ ఎస్కార్ట్ నడుమ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. డిగ్రీ కాలేజ్ ప్రధాన చార్యులు విజయ్ కుమార్ ఈ పరీక్షలకు రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు.
జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా ప్రిలిమ్స్ పరీక్షలు ముగిసాయి.