నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హైదరాబాద్‌లోని ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంస్థ వార్షిక యోజన సమావేశంలో ఇందూరు జిల్లా ప్రతినిధులుగా విశ్రాంత ఆచార్యులు నరేష్ కుమార్, సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ పాల్గొన్నారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇతిహాస సంకలన సమితి జాతీయ సంఘటన కార్యదర్శి బాలముకుందు పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత అమృత ఉత్సవాల్లో భాగంగా మన దేశ చరిత్ర పుస్తకాలలో రాయబడ్డ అనేక అసత్యాలను నిరాధారమైన సంఘటనలను సరిచేస్తూ ఆధారాలతో కూడిన వాస్తవ చరిత్రను భావితరాలకు అందించే ప్రయత్నాన్ని ఇతిహాస సంకలన సమితి భుజాన వేసుకొని విజయవంతంగా పనిని చేస్తున్నదని తెలిపారు.
ఔత్సాహిక చరిత్ర పరిశోధకుల సమావేశాలు ప్రతి జిల్లాలో నిర్వహించాలని ప్రతి జిల్లా యొక్క చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చి తమ ప్రాంతం యొక్క ఉన్నత్యాన్ని తెలుసుకునే విధంగా భావితరాలకు చరిత్రను అందించాలని ఆయన సూచించారు. ఇదే దృష్టి కోణంతో స్థానిక చరిత్రలో కూడా రాయబడ్డ అనేక అసత్యాలను, నిరాధారమైన చరిత్రను గుర్తించి ఆధారంతో కూడిన వాస్తవ చరిత్రను దేశ ప్రజలందరికీ తెలియజేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు.
సమావేశంలో సంస్థ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్టార్ ప్రొఫెసర్ కిషన్ రావు, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్, రాజహంస, మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.