నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు, ఎస్.ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు.
అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయో-మెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లను పిలిపించి, బయో-మెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వసతులతో కూడిన ఏ.ఎన్.ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు.
అభ్యర్థుల హాల్ టికెట్లను ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న మీదటే, మెయిన్ ఎంట్రెన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. కాగా, జిల్లాలో 77.49 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12833 మంది అభ్యర్థులకు గాను 9945 మంది పరీక్ష రాయగా, 2888 మంది గైర్హాజరయ్యారని వివరించారు.
అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్న పత్రాలు, ఇతర సామాగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగగా, పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓ.ఎం.ఆర్ షీట్లు, ఇతర మెటీరియల్ ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి, పోలీస్ ఎస్కార్ట్ నడుమ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. పలు పరీక్షా కేంద్రాలను సైతం తనిఖీ చేశారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా ప్రిలిమ్స్ పరీక్షలు ముగిసాయి.
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. కలెక్టర్ సూచనల మేరకు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర వివరాలను, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.