నిజామాబాద్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయన ఛాంబర్‌లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశంలో పశువుల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షిస్తూ, సూచనలు చేశారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని అన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం గోవధను నిషేధించినందున ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఎక్కడ కూడా గోవధ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాటాపూర్, సాలూర, పొతంగల్, ఖండ్ గావ్, యంచ, పోచంపాడ్, కమ్మరపల్లి, ఇందల్వాయి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. నిబంధలు విరుద్ధంగా వివిధ వాహనాలలో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజ్ చేసిన పశువులకు స్థానికంగానే షెల్టర్ కల్పిస్తూ, వాటికి పశుగ్రాసం, నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో గోశాల నిర్వాహకుల సహకారం తీసుకోవాలని అన్నారు.
సాటాపూర్, ఇందల్వాయి తదితర చోట్ల కొనసాగే పశువుల వారాంతపు సంతలలో నిబంధలు అనుగుణంగా, పశు సంరక్షణ చట్టానికి లోబడి క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఎక్కడబడితే అక్కడ పశువులను వధించకుండా కట్టడి చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, ఆర్దీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథ చారి, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ ఏ.ఓ సిద్ధిరాములు, నగరపాలక సంస్థ ఎంహెచ్‌ఓ సాజిద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.