కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వచ్చే ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించవలసినదిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తైన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, వచ్చే 2024-25 ఖరీఫ్ సీజనుకు ముందస్తుగా చేపట్టవలసిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి సమీక్షిస్తూ అధికారులకు, మిల్లర్లకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల వద్ద వివిధ కారణాలతో తరుగు తీస్తున్నారని, ఇది తగదని ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని హెచ్చరించారు. అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లు సమన్వయంతో టీమ్ వర్క్‌గా పని చేయాలన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని త్వరగా విక్రయించాలనే ఆలోచనతో నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా తెచ్చిన తేమ ఉందని, తాళ్లు, పొల్లు ఉందని తరుగు తీసినట్లు మా దృష్టికి వచ్చిందని, వచ్చే సీజనులో ఇది పునరావృత్తం కారాదని అన్నారు.
రైతుల పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించాలని, ప్రతి కేంద్రంలో అవసరమైన ప్యాడి క్లీనర్లు, డ్రైయ్యింగ్ మిషన్లు, జాలి మిషన్లు అందుబాటులో ఉంచాలన్నారు. నాలుగు మాసాలలో ఖరీఫ్ పంట చేతికి వస్తున్నందున ప్రస్తుతం మిల్లులలో ఉన్న ధాన్యాన్ని ఎఫ్ సి ఐ అధికారులు వ్యాగన్ల ద్వారా త్వరగా తరలించాలని అప్పుడే ఖరీఫ్ ధాన్యాన్ని అన్ లోడిరగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఎఫ్.సి.ఐ. అధికారులు గోదాములలో ఎక్కువ స్థలం కేటాయించి వ్యాగన్ల ద్వారా సి.ఏం.ఆర్. రైస్ ను త్వరితగతిన తరలించుటకు లేఖ వ్రాయవలసినదిగా అధికారులకు సూచించారు. సకాలంలో నాట్లు వేసుకునేలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాల పట్ల రైతులను అప్రమత్తం చేయడంతో పాటు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రబీ సీజనులో జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,27,631 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో 85 కేంద్రాల ద్వారా 93 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అకాల వర్షాలు, పాత సీజన్లకు సంబంధించి రైస్ మిల్లులల్లో ధాన్యం పేరుకుపోయి అన్‌లోడ్ చేయడానికి స్థలం లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు పడ్డ రైస్ మిల్లులు ఓపెన్ ప్లేస్‌లలో ధాన్యం దించుకున్నారన్నారు.
ప్రతి కొనుగోలు కేంద్రాలలో రైతు వారీగా ఎంత ధాన్యం ఉంది, ఎన్ని లారీలు అవసరమో మానిటరింగ్ చేస్తూ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. వచ్చే సీజనులో లోడిరగ్, అన్‌లోడిరగ్ త్వరగా జరిగేలా చూస్తామని, ప్రస్తుతం మిల్లులలో ఉన్న ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ. వ్యాగన్ల ద్వారా నిరంతరంగా ధాన్యం లిఫ్ట్ చేసేలా మానిటరింగ్ చేస్తామన్నారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా మేనేజర్ నిత్యానందం, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఎఫ్.సి.ఐ. డివిజనల్ మేనేజర్ ప్రకాష్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల సహకార అధికారి శ్రీనివాస్, డిసిఎంఎస్ అధికారి రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు లింగం తదితరులు పాల్గొన్నారు.