నిజామాబాద్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ స్టడీ సర్కిల్ లో గత సంవత్సర కాలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడారు.
నిజామబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ అక్రమాలకు నిలయంగా మారిందన్నారు. డీఎస్సీడీవో శశికళ, ఎస్సీ స్టడీ సర్కిల్ ఇంచార్జ్ వార్డెన్ ఎస్.మారుతి ఈ అక్రమాలకు మూల కారణమని ఆరోపించారు. వీరిద్దరూ కలిసి కిందిస్థాయి సిబ్బందిని వేధించి మరీ, వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షల సన్నద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్లు వీరికి ఆదాయ వనరులుగా మారాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించడం మరిచి, ఆస్తులు పోగేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ స్టడీ సర్కిల్లో ఒక్కో విద్యార్థికి ?75 ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. నాసిరకం భోజనం, సౌకర్యాలలేమితో తక్కువ మంది హాజరైనా, 100 మంది హాజరవుతున్నారని లెక్కలు రాసి, నిధులు కాజేశారన్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. సంక్షేమ హాస్టల్ సిబ్బందితో స్టడీ సర్కిల్లో పనులు చేయించుకుని, బినామీ పేర్లతో జీతాలు నొక్కేస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేశారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో గత రెండు సంవత్సరాల నుండి నేటి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళు, స్టడీ సర్కిల్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి, మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేనిచో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే. అశుర్, జిల్లా నాయకులు నసీర్,నాగేష్,సలీం, వర్ధన్, సమీర్, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.