కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లోకసభ ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్ డిఓ చందర్, కలెక్టరేట్ ఏ.ఓ.లతో కలిసి ప్రజల నుండి 50 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 33, వ్యవసాయం 5 సివిల్ సప్లై 2, మునిసిపల్ 04, సర్వే ల్యాండ్ 2, విద్యాశాఖ 1, గ్రామ పంచాయతి 02, గిరిజన సంక్షేమ శాఖ కు ఒకటి చొప్పున వినతులు వచ్చాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో తమ సమస్యలు చెబితే వెంటనే పరిష్కారమవుతాయని దృఢనమ్మకంతో ఎంతో బాధ, ఆవేదనతో వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదీదారులు వస్తారని, వారిని ఆప్యాయతతో పలకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలని, లేదా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారని అన్నారు.
ఇక్కడ పరిష్కారం కాకపొతే ప్రజాభవన్‌కు వెళుతున్నారని, ఆ పరిస్థితులకు దారితీయకుండా ఫిర్యాదీదారుల వినతులను సమగ్రంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిర్వహించే ప్రజావాణిలో జిల్లాకు సంబంధించి 391 వినతులు అందగా ముఖమంత్రి (CMO) కార్యాలయం నుండి అట్టి వినతులను జిల్లాకు పంపారని అన్నారు.
వాటిని సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేకశ్రద్ధతో పరిశీలించి పరిష్కరించాలన్నారు. దరఖాస్తు తిరస్కరణ లేదా పరిష్కరించక పోవడానికి సాహేతుకమైన కారణాలుంటే ఫిర్యాదీదారుకు సకాలంలో తెలపాలని, ఎట్టి పరిస్థితులలో తమ వద్ద అనవసరంగా పెండిరగ్ పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పరిష్కరించిన వినతులను prajavanisno@gmail.com లో వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు రాజారామ్, రాజు, దయానంద్, వరదా రెడ్డి, భాగ్యలక్ష్మి, శ్రీధర్, శ్రీనివాస్, బావయ్య తదితరులు పాల్గొన్నారు.