కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ దేవి సింగ్, మండల కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, జయ ప్రదీప్ పాల్గొన్నారు.