నట్టల నివారణకు ఆల్బెండజోళ్‌ మాత్రలు వాడాలి…

కామారెడ్డి, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పిల్లలలో నట్టల నివారణకు ఈ నెల 20 న 14 వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నులి పురుగులు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి వంటి వాటితో బాధపడతారని అన్నారు.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో పేద పిల్లలు చెప్పులు లేకుండా నడవడం వల్ల వచ్చే అవకాశముందని అన్నారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల లోపు 2,50,254 పిల్లలున్నారని గుర్తించడం జరిగిందని వారికి నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 20 న ఆల్బెండజోళ్‌ మాత్రలు వేయనున్నామన్నారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర, రెండు నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్రను నలిపి ఇవ్వాలని, 3 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలకు చప్పరించేలా వేయించాలని అధికారులకు తెలిపారు.

మందులు వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావని, మధ్యాన్నం భోజనం చేసిన తరువాత పిల్లలు మాత్ర వేసుకునేలా అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఏదేని కారణం చేత ఆ రోజు తప్పిపోయిన పిల్లలకు ఈ నెల 27 న మాప్‌ అప్‌ కార్యక్రమాన్ని నిర్వహించి మాత్రలు అందించాలని అన్నారు.

అన్ని అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలు వేయాలని అన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సైతం ఆల్బెండజోల్‌ మాత్రలు పిల్లలకు వేయించాలని, ఎట్టి పరిస్థితులలో మాత్రలు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించకుండా చూడాలని, ఇందుకు ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు కృషి చేయాలన్నారు.

మాత్రలు వేసుకున్న తర్వాత పిల్లలకు తాగునీటిని అందించాలన్నారు. ప్రభుత్వం అందించే ఆల్బెండజోళ్‌ మాత్రలు చాలా శ్రేష్ఠమైనవని, ఒక్క నులిపురుగు నివారణకే గాక ఎట్టి ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఈ మాత్ర పనిచేస్తుందని అన్నారు. ఇట్టి మాత్రలు వందశాతం పిల్లలు వేసుకునేలా జూన్‌ 20 న అందరు పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వచ్చేలా క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా పర్యటించి పర్యవేక్షణ చేయాలన్నారు.

అత్యవసర సమయంలో 108 అంబులెన్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ఇట్టి కార్యక్రమంపై గ్రామ, మునిసిపల్‌ స్థాయిలో టాం టాం ద్వారా ప్రచారం చేయాలని, డిపిఓ, మునిసిపల్‌ కమీషనర్ల సూచించారు. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా ఉండేందుకు శుభ్రమైన నీటిని తాగడం, ఆహారంపై ఈగలు దోమలు ఆడకుండా సరైన ఆహారాన్ని తీసుకునేలా చేయడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉపయోగించుకోవడం, బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన లాంటివి చేయకుండా ఉండేలా ప్రజలలో, పిల్లలలో అవగాహన కల్పించాలని శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు.

సమావేశంలో ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌, యెన్‌ సిడి ప్రోగ్రాం అధికారి శిరీష, డిపిఓ శ్రీనివాస్‌, ఎస్సి కార్పొరేషన్‌ ఈ డి దయానంద్‌, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా సంక్షేమాధికారి బావయ్య, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం, డీఈఓ, మెప్మా, మునిసిపల్‌ శాఖల నుండి ప్రతినిధులు, రెడ్‌ క్రాస్‌ సంస్థ చైర్మన్‌ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »