కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్సి వసతి గృహాలలో 1 నుండి 10 వ తరగతి ప్రీమెట్రిక్, ఇంటర్ నుండి పిజి, బి.ఎడ్ వరకు పోస్టుమెట్రిక్ తరగతులలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వసతి గృహంలో ప్రవేశానికి విద్యార్థుల స్వగ్రామం 5 కిలో మీటర్ల పై బడి దూరం ఉన్న వారికే అవకాశం కల్పిస్తామన్నారు. అర్హత ఉండి వసతి గృహాలలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఎస్సి వసతి గృహ సంక్షేమాధికారి నుండి దరఖాస్తు ఫారాలు పొంది అందువెంట బోనఫైడ్, కుల,ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు జతపరచి ఈ నెల 30 లోగా సమర్పించవలసినదిగా సూచించారు.
వసతి గృహా సౌకర్యాలు, ఇతర వివరాలకు వసతి గృహ సంక్షేమాధికారిని సంప్రదించవలసినదిగా రజిత పేర్కొన్నారు.