నిజామాబాద్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆయా పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతో పాటు, ఈ నెల 30 నుండి జూలై 04 వరకు కొనసాగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
అలాగే ఈ నెల 23 నిర్వహించనున్న నీట్ పీ.జీ ఎగ్జామ్ ఏర్పాట్లపై సమీక్ష జరుపుతూ, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షలో నిర్ణీత తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు కొనసాగుతాయన్నారు. నీట్ పీ.జీ ఎగ్జామ్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
పరీక్షలు సాఫీగా కొనసాగేలా సంబంధిత అధికారులతో పాటు చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎంఎంలను ఏర్పాటు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు.
144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్నందున అభ్యర్థులు కనీసం రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. అధికారులు అందరు సమన్వయంతో పనిచేయాలని, పరీక్షల నిర్వహణ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ పరీక్షల విభాగం పర్యవేక్షకుడు పవన్, ఆర్టీసీ, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.