కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన ట్యూబులైట్స్, ఫాన్స్ క్రింద చక్కగా చదువుకుంటున్న విద్యార్థులను పలకరించి వారు అందంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంతోషం వ్యక్తం చేశారు.
మంగళవారం తాడ్వాయి మండలం ఎర్రపహడ్ లోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మరమత్తు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ మిగిలిన పనులను రేపటిలోగా పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో 3 లక్షల 85 వేల ఖర్చుతో చేపట్టిన టాయిలెట్ బ్లాక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, నల్లాలు, విద్యుద్దీకరణ, ఫాన్స్ ఏర్పాటు పనులను, ప్రాథమిక పాఠశాలలో లక్ష 15 వేల ఖర్చుతో చేపట్టిన మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారంలోగా పనులు పూర్తి చేసి నివేదిక అందించాలన్నారు.
మహిళా సమాఖ్య సభ్యులతో పనులు నాణ్యతతో చేపట్టారా అని వాకబు చేశారు. కార్యక్రమంలో తహశీల్ధార్ రహిమోద్దీన్, ఎంపిడిఓ సాజిద్ అలీ, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ వీరానంద్, ఎంఈఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి, స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు.