కామారెడ్డి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ సింధు శర్మ జండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు.
విద్యార్థులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే విద్యార్థులకు భవిష్యత్తు ఉండదని తెలిపారు. ఎవరైనా మాదకద్రవ్యాలు స్వీకరించిన, రవాణా చేసిన, విక్రయాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారిపై తల్లిదండ్రులు, అధ్యాపకులు దృష్టి సారించాలని చెప్పారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మదకద్రవ్యాలను నియంత్రణ, వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మదకద్రవ్యాలు భవిష్యత్తులో వినియోగించబోమని అధికారులు, విద్యార్థులు ఫ్లెక్సీ పై సంతకాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా,శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ అధికారి బావయ్య మదకద్రవ్యాలను భవిష్యత్తులో వినియోగించబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వర్, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, మిషన్ పరివర్తన కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, సుమన్, ఎక్సైజ్, ఐసిడిఎస్ అధికారులు, ఎస్సైలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.