కామారెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాతృ మరణాలు జరగకుండా సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు సంభవించకుండా జాగ్రత్త పడడం వైద్యాధికారుల కర్తవ్యం అని అన్నారు.
మాతృ మరణాలు జరుగకుండా ఏ. ఎన్.ఎమ్. స్థాయి నుండి వైద్యాధికారి మరియు జిల్లా స్థాయిలో ఎం.సి.హెచ్.ప్రోగ్రాం అధికారి వరకూ అందరూ బాధ్యతతో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్, ఎం.సి.హెచ్.ప్రోగ్రాం అధికారి డా.శోభారాణి, డి.సి.హెచ్.ఎస్.డా.విజయలక్ష్మి, సంబంధిత వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.