నిజామాబాద్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు.
పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మీదట గోడౌన్ లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.