కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ అర్వి కర్ణన్ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డయాలసిస్, ఆపరేషన్ థియేటర్, పాలియేటివ్ కేర్ సెంటర్, శస్త్ర చికిత్స వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్ రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, స్కానింగ్ కేంద్రం, ఆర్టీసీ ఆర్ కేంద్రాలను పరిశీలించారు.
రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యాసదుపాయల గురించి వాకబు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నదని ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని, ఆస్పత్రిలో అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల వైద్య సేవలకు వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు, రోగి సహాయకుల కోసం మౌలిక వసతులను హాస్పిటల్ పర్యవేక్షకులను అడిగి తెలుసు కున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని కమిషనర్ వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వైద్య సేవలకు వచ్చే ప్రజలకు వైద్యలు అందుబాటులో ఉండాలని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్య సేవలకు ప్రజలు ప్రయివేటు హాస్పిటల్ కు వెళ్లకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలకు అస్తమైన అన్ని రకాల స్కానింగ్ లను నిర్వహించి ఆన్లైన్లో రిపోర్ట్ అందించాలని వైద్యాధికారులను కమిషనర్ అదేచించారు. ఈ సందర్భంగా టి దయాగ్నస్టిక్ హాబ్ పరిశీలించారు
కార్యక్రమంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్, డిసిహెచ్‌ఎస్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటిండెంట్ బన్సీలాల్, ఆస్పత్రి ఆర్‌ఎంఓలు శ్రీనివాస్, సుజాత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.