కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.వి.కర్ణన్ శనివారం కామారెడ్డిలోని కలక్టరేట్ కార్యాలయంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా సంక్షేమ అధికారి (మహిళ, శిశు సంక్షేమ, వికలాంగుల శాఖ) మరియు జిల్లాలోని మున్సిపల్ శాఖ అధికారులు, జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రికి అధికారులు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్విహించారు.
సమావేశంలో డెంగ్యూ , మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి అని మరియు తగు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి మరియు గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు ఇట్టి విషయంలో పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. తగిన ముందు జాగ్రత్త చర్యలతో ఇట్టి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.
డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలినప్పుడు చేపట్టవలసిన కార్యాచరణ ఎస్.ఓ.పి.గురించి వివరించారు. డయేరియా (అతిసార) వ్యాధి నియంత్రణ ప్రత్యేక కార్యక్రమం ఐ.డి.సి.ఎఫ్.లో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జింక్ మాత్రలు, ఓ.ఆర్.ఎస్. అందుబాటులో ఉంచాలని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌లు సంక్రమగా ఇవ్వాలని మరియు డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల గురించి ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రి నుండి తగిన సమాచారం, నివేదికలు ఇవ్వాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లాలోని వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.విజయలక్మి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్, జిల్లా పంచాయతి అధికారి, డి.డబ్ల్యూ.ఓ., మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.