కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయి.
అట్టి ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ క్షుణ్ణంగా పరిశించి పరిష్కరింపదగినవి వెంటనే పరిశీలించాలని, లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదీదారునికి తెలపాలన్నారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.