కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో ఆయా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా మొత్తం 17 లక్షల 88 వేల మొక్కలను వనమహోత్సవ కార్యక్రమంలో నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని ఇందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చెయ్యాలన్నారు.
ప్రతి శాఖ వారు మీకు ఇచ్చిన టార్గెట్ ను తప్పకుండా పూర్తి చేయాలని అన్ని ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల హాస్టల్లో మొక్కలు నాటించాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు ఫారెస్ట్, మున్సిపల్, గ్రామీణ అభివృద్ధి శాఖ వారి నర్సరీల నుండి పొడవాటి మొక్కలు ఎంచుకున్న ప్రాంతాలకు తీసుకెళ్లి మొక్కలు నాటాలన్నారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్ సైతం ఆకర్షించే విధంగా పచ్చదనం పరిమళించేలా మొక్కలను ఎంచుకొని నాటాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.