నిజామాబాద్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల పాత విద్యాశాఖ కార్యాలయ స్ధలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ రాష్ట్ర మాజీమంత్రి, బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజెందర్ రెడ్డి,బార్ ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి దీపక్, సీనియర్ న్యాయవాదులు మంచికంటి గోవర్ధన్, ఆకుల రమేష్, రాజేశ్వర్ రెడ్డి, ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, రాజలింగం, గడుగు గంగాధర్లతో కూడిన ప్రతినిధి బృందంతో కలిసి సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
జిల్లాకోర్టు ప్రాంగణంలో కక్షిదారుల ప్రయోజనాల దృష్ట్యా కోర్టుల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా కక్షిదారులు పెరగడం మూలంగా తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడికి గురికావడం జరుగుతున్న దని జగన్ మాజీమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లా జ్యూడిషియరిలో పొక్సో కోర్టు, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు,5 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు,ఉమెన్స్ కోర్టు లు దానికి అనుగుణంగా న్యాయమూర్తులు ఉండటం,న్యాయ సిబ్బంది పెరగడం మూలంగా ప్రస్తుతం ఉన్న జిల్లాకోర్టు అవరలోని స్థలం సరిపోవడం లేదని విన్నవించారు.
న్యాయవాదులు,కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఓపెన్ స్థలం లేకపోడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాకోర్టు కు ఆనుకుని ఉన్న పాత విద్యాశాఖ కార్యాలయ ఖాళీ స్థలం జిల్లా జ్యూడిషియరికి కేటాయించే విదంగా కృషి చేయాలని జగన్ కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మాజీమంత్రి, బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించి జిల్లా వాసిగా, జిల్లాకోర్టు అవసరాలకు, న్యాయవాదుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తానని తెలిపారు.