కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13 న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధారిటీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ముసాయిదా జాబితాలను స్థానిక గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ఈ నెల 13 న ముసాయిదా జాబితా ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 21 లోగా సంబంధిత పంచాయతీ కార్యదర్శిలకు అందజేయాలని తెలిపారు. అట్టి అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 26 లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
తుది ఫోటో ఎలెక్టోరల్ జాబితాను ఈ నెల 28 న ఆయా గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత జాబితా సాఫ్ట్ కాపీ లను రాజకీయ పార్టీలకు అందించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో శ్రీనివాస్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.