నిజామాబాద్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల (సెప్టెంబర్) 30 నుండి దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
పై నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ స్థానంతో పాటు, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పిస్తూ ఈ నెల 30న పబ్లిక్ నోటీసును జారీ చేయనుందని తెలిపారు. అక్టోబర్ 16, 25 వ తేదీలలో రెండు పర్యాయాలు పత్రికాముఖంగా కూడా ప్రకటనలు జారీ చేస్తారని అన్నారు.
2024 నవంబర్ 06 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏఈఆర్‌ఓ కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయవచ్చని అన్నారు.
2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల 30 నుండి 2024 నవంబర్ 06 వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు ఫారం-18 లో, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఫారం-19 లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. కరీంనగర్ డీఆర్‌ఓ ఈ ఎన్నికలకు ఈఆర్‌ఓగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు.