నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారతీయ జీవన విధానంలో హిందూ సంస్కృతి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఆ సంస్కృతికి ఆధారం కుటుంబ వ్యవస్థ అని ఆ కుటుంబాన్ని సంస్కరించే బాధ్యత ఎప్పటికీ తల్లిదండ్రుల దేనని రాష్ట్ర సేవికాసమితి జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ శుభ వ్యాఖ్యానించారు.
భారతమాత భజన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్ హనుమాన్ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆవిడ మాట్లాడుతూ ఒక చత్రపతి శివాజీ ని తయారు చేసింది తన తల్లి జిజియా మాత అని స్వామి వివేకానంద ను రూపుదిద్దింది కూడా అతని తల్లేనని ప్రతి కుటుంబాన్ని తీర్చిదిద్దగలిగే సహనాన్ని కలిగి ఉండేది తల్లిదండ్రులలో మాత్రమే కాబట్టి మన సంస్కృతి వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆవిడ తెలిపారు.
వారానికి ఒకసారి అయినా కుటుంబమంతా కలిసి భజన చేయాలని తద్వారా పిల్లలలో భక్తి మరియు భగవంతుడి పట్ల విశ్వాసం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ భజన మండలిల పేరుతో వేలాదిమందిని ఒక కుటుంబంగా మార్చిన ఘనత సుబ్బారావుకి చెందుతుందని వారి కృషి ఫలితంగానే ఈరోజు దాదాపు 100 భజన మండలు ఏర్పడ్డాయని, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్న భజన మండలి సభ్యులందరూ అభినందనీయులని ఆయన పేర్కొన్నారు.
భజన పోటీలకు న్యాయ నిర్ణయితలుగా ఈమని సాయి ప్రసాద్, బూర్ల రవీంద్ర వ్యవహరించారు. కార్యక్రమంలో భారత్ మాతా భజన మండలి వ్యవస్థాపకులు వైట్ల సుబ్బారావు, సహ సంయోజిక మేఘ సుబేదార్, పోతు గణేష్, పోల్కం గంగా కిషన్, దోర్నాల రవి, 39 భజన మండల్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.