నిజామాబాద్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తెస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి సోమవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రగతి గురించి మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర శాఖలపై సమీక్షలో సమగ్ర చర్చ జరిపారు. జిల్లాలో 71 వేల రైతు కుటుంబాలకు రూ. 626 కోట్ల రుణమాఫీ జరిగిందని కలెక్టర్ వివరించారు. పలు సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ జరుగలేదని, ఈ విషయమై ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపామని అన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి జూపల్లి అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ, ప్రజలకు పారదర్శకమైన పాలన అందేలా కృషి చేయాలని హితవు పలికారు. అర్హులైన రైతులందరికీ తప్పనిసరిగా రూ. 2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పలు సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ జరుగనందున, అలాంటి రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సాంకేతిక ఇబ్బందులను అధిగమించి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ద్వారా లబ్ది చేకూరేలా చూడాలన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టతతో ఉన్నారని మంత్రి వెల్లడిరచారు. కాగా, జిల్లాలో ఈసారి అధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నందున అందుకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట సన్న రకం, దొడ్డు రకం ధాన్యాలకు వేర్వేరుగా కేంద్రాలను నెలకొల్పాలని, ప్రతి కేంద్రంలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యంగా అకాల వర్షాలు కురిస్తే ధాన్యం నిల్వలు తడిసిపోకుండా సరిపడా టార్పాలిన్లు సమకూర్చాలని సూచించారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, గత సీజన్లో జిల్లాలో 435 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగగా, ఈసారి 505 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అవసరమైన పక్షంలో మరిన్ని కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు అన్ని విధాలుగా అధికారులను సన్నద్ధం చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా అవసరమైతే ఇతర శాఖల సిబ్బందికి సైతం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై శిక్షణ ఇచ్చి వారి సేవలు వినియోగించుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా అవసరమైన మేర గిడ్డంగులను గుర్తించాలన్నారు.
విద్యాశాఖపై చర్చ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో వసతులను మెరుగుపర్చి నాణ్యమైన విద్యా బోధన జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలను గణనీయంగా మెరుగుపడేలా ప్రతిఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. తరగతి గదులు, శానిటేషన్, టాయిలెట్స్, నీటి వసతి, ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు వంటి కనీస సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.
పాఠశాలలకు ఆంగ్ల, తెలుగు దినపత్రికలు అందేలా చర్యలు తీసుకోవాలని, డిక్షనరీని సమకూర్చాలని తద్వారా విద్యార్థుల్లో సామర్ధ్యం పెంపొందేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి జూపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోలిస్తే, ప్రభుత్వ బడులలో నిపుణులు, విషయం పరిజ్ఞానం కలిగిన అధ్యాపకులు ఉంటారని, పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేలా అంకిత భావంతో బోధన విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.
సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు అవార్డులు అందించి ప్రోత్సహించాలని కలెక్టర్ కు సూచించారు. కాగా, పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని డీఈఓను ఆదేశించారు. వైద్య రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పెంపొందేలా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులలో కనీసం సగభాగం నిధులను విద్యా, వైద్య రంగాలకు వెచ్చించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. డెంగ్యూ, విష జ్వరాలు, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అధికారులు కూడా ప్రజలకు జవాబుదారిగా ఉంటూ సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతీ పైసా ప్రజల కష్టార్జితం అయినందున, నిధులు వృధా కాకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. గత పాలకులు లెక్కకు మిక్కిలి అప్పులు చేసిన ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్ధిక భారం పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన వారందరికీ రైతు భరోసా అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గేడ్ చేస్తాం
కాగా, నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగ శిక్షణార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశానికి ముందు మంత్రి జూపల్లి నిజామాబాద్ నగరంలో రూ. 6 కోట్లతో నిజామాబాద్ నుంచి నర్సీ రోడ్ మరమ్మతులు, రూ. 4.50 కోట్లతో నిజామాబాద్ – వర్ని రోడ్ మరమ్మతు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆర్మూర్ నవనాథ్ సిద్ధులగుట్టను దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.