నిజామాబాద్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో తహశీల్దార్ క్యాడర్ లో పదవీ విరమణ చేసిన కలెక్టరేట్ కార్యాలయ ఈ-సెక్షన్ పర్యవేక్షకుడు విజయేందర్ రెడ్డి అందించిన సేవలు
ప్రశంసనీయం అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. విజయేందర్ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా వీడ్కోలు పలికారు.
పూలమాలలు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. రెవెన్యూ శాఖ ఉద్యోగిగా విధుల్లో చేరిన విజయేందర్ రెడ్డి ఎలాంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్ ను పూర్తి చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ అభినందించారు. సీ.సీ గా సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించడంతో పాటు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నిర్వర్తించారని అన్నారు. కాగా, విజయేందర్ రెడ్డి సేవలను భవిష్యత్తులో కూడా వినియోగించుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.
కలెక్టరేట్ లో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాలలో ఆయన అందించిన సేవలను సహచర అధికారులు, సిబ్బంది సైతం కొనియాడుతూ, శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కాగా, తన ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి విజయేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.