నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 వ తేదీ నుండి పైలెట్ ప్రోగ్రామ్ కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, భూముల క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల సత్వర పరిష్కారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి, సీ.ఎస్ శాంతికుమారి సమీక్ష జరిపారు.
డిజిటల్ కార్డుల జారీకై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు గ్రామాలలో ప్రయోగాత్మక సర్వే నిర్వహించాలన్నారు. అర్బన్ నియోజకవర్గాలైతే రెండు వార్డులు/డివిజన్లను ఎంపిక చేయాలని సూచించారు. ఇంటింటి పరిశీలన చేపట్టి, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, ఈ నెల 8 వ తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని అన్నారు.
9 న స్క్రూటినీ జరిపి, 10 వ తేదీన సర్వేకు సంబంధించిన అన్ని అంశాలతో సమగ్ర నివేదిక పంపించాలని కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఏ ఒక్క కుటుంబం సైతం తప్పిపోకుండా సర్వేను పకడ్బందీగా జరిపించాలని, ఆర్డీఓ/జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి క్షేత్రస్థాయిలో సర్వే తీరును నిశితంగా పరిశీలన చేయాలన్నారు.
కాగా, సర్వే సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను సేకరించడం తప్పనిసరి కాదని, ఫోటో కోసం ఎవరిని కూడా ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి రోజు ఒక్కో బృందం 30 నుండి 40 కుటుంబాలకు సంబంధించిన సర్వేను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుని, గడువు లోపు పైలెట్ సర్వేను పూర్తి చేయించాలని అన్నారు. ఆయా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందేందుకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ డిజిటల్ కార్డులను జారీ చేయనున్నందున ఇంటింటి పరిశీలనను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
పైలెట్ సర్వే పూర్తయిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పైలెట్ సర్వే ప్రక్రియను తీరును పరిశీలించేందుకు ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చొప్పున రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలలో పర్యటిస్తారని అన్నారు.
కాగా, భూముల క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని, నిబంధనలకు లోబడి ఉన్న దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. ఆయా ప్రాంతాలలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను దసరా కానుకగా అర్హులైన వారికి కేటాయించేందుకు గాను లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాలను ఒకటిరెండు రోజుల్లోనే పంపిస్తామని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని అన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ కోసం విరివిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యాలకు వేర్వేరుగా కేంద్రాలను నెలకొల్పాలని, ఈ నెల 15 వ తేదీ నాటికి ప్రతి మండలంలో కనీసం ఒక కొనుగోలు కేంద్రాన్ని తప్పనిసరి ప్రారంభించాలని, ధాన్యం దిగుబడులను అనుసరిస్తూ అన్ని ప్రాంతాలలో రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ వర్తింపజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎలాంటి సమస్యలు, ఇబ్బందులకు తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.