నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో సీబీసీ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో ‘‘స్వచ్ఛత హి సేవా’’ అవగాహన కార్యక్రమం శ్రమదానంతో పాటు ముందస్తు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ సంయుక్తంగా మాట్లాడుతూ….సత్యం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. మహాత్ముల జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతగా పేర్కొన్నారు. ‘స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత’ నినాదంతో ఈ ఏడాది ‘‘స్వచ్ఛత హి సేవా’’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడం, స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవలన్నారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువతి, యువకులు చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్కరికి స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు తడి చెత్త పొడి చెత్తను ఇలా వేరు చేయాలని అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ‘‘స్వచ్ఛత హి సేవా’’ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేశారు. కార్యక్రమంలో సిబిసి ఎఫ్ పీఏ రషిద్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎన్ సిసి అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలింటర్లు, తదితరులు పాల్గొన్నారు.