నిజామాబాద్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీమ్పై మదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవరోజు ఆందోళన కొనసాగింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లాకోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలను ఏకరువుపెట్టారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రెండ్లి పోలీసింగ్ పోయి, న్యాయవాదుల ప్రాణాలకు ఎసరుపెట్టే పోలీసింగ్ తయారు అయిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లలో న్యాయవాదుల కోర్టుల విధుల బహిష్కరణ కొనసాగిందని వెల్లడిరచారు. శాంతిభద్రతలు, శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కొందరు పోలీసుల మూలంగా అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి రావడం దృరదృష్టకరమని తెలిపారు.
పోలీసు శాఖలో రాక్షస మనస్తత్వం ఉన్న, పౌరుల హక్కులను గుర్తించని వారిని పోలీసు ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలని జగన్ డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు మాదన్నపేట్ నేరమయ ఘటనకు భాద్యులైన పోలీసులపై డిజిపికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తక్షణమే బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్న దృష్ట్యా న్యాయవాద వృత్తి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి దొన్పాల్ సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, కోశాధికారి దీపక్ న్యాయవాదులు అపూర్వ, మానిక్ రాజు, ఆశా నారాయణ, అన్వేష్, సృజన్, విజయ్ సామ్రాట్ మధుసూదన్ గౌడ్ విశ్వాక్ సేన్ మధు చుక్కబొట్లరాజు ప్రకాష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.