నిజామాబాద్, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను వంద శాతం సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ (సోమవారం) నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలోని సుమారు 24 వేల మంది మత్స్యకారులకు లబ్ది చేకూరేలా ప్రస్తుత 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 2.27 కోట్ల చేప పిల్లలు చెరువులలో వదలడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.
వీటిలో 35 నుంచి 40 ఎం.ఎం సైజు గల చేప పిల్లలు 135 లక్షలు, 80 నుంచి 100 ఎంఎం సైజు గల 91 లక్షల చేప పిల్లలను మత్స్య అభివృద్ధి పథకం కింద విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
చెరువులలో చేప పిల్లలు వదిలే సమయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు వాటి నాణ్యతను సక్రమంగా చూసుకోవాలని, ఆయా చెరువులకు మంజూరు చేయబడిన మేరకు పూర్తి స్థాయిలో చేప పిల్లలు వదులుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. చేప పిల్లల సైజుని స్కేలుపై కొలిచి నిర్ధారించుకోవాలని, చేప పిల్లలు చలాకి గా ఉన్నాయో లేదో గమనించాలని, చేప పిల్లలను వదిలే సమయంలో ఆయా సంఘాల సభ్యులు తప్పనిసరిగా ఉండి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.
చేప పిల్లల సైజులో కానీ వాటి రకాలలో, నిష్పత్తిలో ఏవైనా తేడాలు ఉన్నట్లయితే, వెంటనే జిల్లా మత్స్యశాఖ అధికారులకు లేదా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.