కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వచ్చే నవంబర్ మొదటి వారంలో జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించుటకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నవంబర్ మొదటి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
పత్తి క్వింటాలుకు సి.సి. ఐ. కనీస మద్దతు ధర రూ. 7,521/- లుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ అధికారుల సమాచారం మేరకు జిల్లాలో సుమారు 2.36 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు ధర క్వింటాలుకు రూ. 7500/- లకు పైగా ఉన్నట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 8 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, కొనుగోళ్లు చేసి ఆ మిల్లులకు పంపించడం జరుగుతుందని సి.సి. ఐ. అధికారులు తెలిపారని అన్నారు. ముఖ్యంగా కొనుగోళ్ళ గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.
గతంలో లాగా తెలుగు, మరాఠీ భాషల్లో రికార్డింగ్ చేసి ప్రచారం చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని మిల్లర్లకు తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన పత్తి కి మూడు రోజుల్లో చెల్లింపులు చేయాలని అన్నారు. అనంతరం పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, సి.సి. ఐ. ఇన్చార్జి ఓబుల్ రెడ్డి, డిఎస్పీ , జిల్లా ఫైర్ అధికారి,తూనికలు కొలతల అధికారి, ఆర్టీవో, వివిధ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.