కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ సమస్యలపై దరఖాస్తు దారుల అర్జీలను సమర్పించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులను అందజేశారు. ప్రజా వాణి అనంతరం ఇందిరమ్మ కమిటీలు, ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు, ప్రజావాణి పెండిరగ్, ధాన్యం సేకరణ అంశాలపై అధికారులకు కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఇందిరమ్మ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని తెలుపుతూ , గ్రామ స్థాయిలో, మున్సిపల్ వార్డ్ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. అట్టి కమిటీల వివరాలు తెలుపుతూ సంతకం చేసిన జాబితాలు సమర్పించాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల మేరకు సర్వే టీమ్ లు ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే త్వరితగతిన చేయాలని అన్నారు.
క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలన చేయాలని తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం వరకు 18182 అర్జీలను రాగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులు 17,455 అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరిగిందని, మిగతా 727 అర్జీలలో 533 పెండిరగులో ఉన్నాయని, 194 దరఖాస్తులు ఇతర శాఖలకు చెందినవి కాగా వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారని తెలిపారు. సోమవారం 49 అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. పెండిరగ్ అర్జీలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆయా కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత మండల, జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సి.ఈ. ఒ. చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.