కామారెడ్డి, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వచ్చే డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీటిని కామారెడ్డి మున్సిపల్, 215 ఆవాసాలకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ఆగిపోయిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. 195 కోట్లతో మంజూరైన మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద పైప్ లైన్ పనుల్లో రాయి ఏర్పడి పనులు ఆగిపోయాయని, బ్లాస్టింగ్ చేయవలసి ఉన్నదని, ఆర్డీఓ అనుమతి కావాలని ఇంజనీరింగ్ అధికారులు కోరగా వెంటనే అనుమతించాలని ఆర్డీఓ కు కలెక్టర్ సూచించారు. మరికొంత కల్వర్టుల పనులు అటవీ భూముల్లో చేయవలసి ఉన్నందున జిల్లా అటవీ అధికారి అనుమతులు కావాలని తెలుపగా, అట్టి అనుమతులు ఇవ్వాలని డి.ఎఫ్. ఒ. ను కలెక్టర్ ఆదేశించారు.
జాతీయ రహదారి 44 వెంబడి పైప్ లైన్ వేయుటకు ఎన్.హెచ్. ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమతులు కావాలని కోరగా, వెంటనే అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పనుల్లో భాగంగా 41 కి.మీ. పైప్ లైన్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటీకి పూర్తిచేసి నీరు సరఫరా చేయాలని కలెక్టర్ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మల్లన్న గుట్ట వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
నీటి శుద్ధి విధానం, నాణ్యతలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్.ఈ. నిజామాబాద్ కే.రాజేంద్ర కుమార్, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సి.ఈ. ఒ. చందర్, ఈఈలు నరేష్, రమేష్, డిప్యూటీ ఈ ఈ లు నవీన, కే.ఎల్.ఎస్.ఆర్. గుత్తే దారు అర్షిద్ అలీఫ్, ఇతర ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.