నిజామాబాద్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పనిదినాలు, వేజ్ స్లిప్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులతో ర్యాలీగా వెళ్లి శివాజీ కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ గత కొంతకాలంగా శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీలు చుట్టే కార్మికులకు నెలలో కేవలం 8 నుండి 12 పనిదినాలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతు, కుటుంబాలు గడపడమే కష్టమైపోతుందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లే ఆఫ్ కొనసాగిస్తూ కార్మికులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. వెంటనే 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా 1000 బీడీలకు ఇస్తున్న 600 గ్రాముల తునికాకులో 600 బీడీలే తయారవుతున్నాయన్నారు. మిగతా 400 బీడీలకు కార్మికులే బయటకొని తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైన చర్యని ఆరోపించారు. కార్మికులకు వెయ్యి బీడీలకు సరిపోయేంత తునికాకు తంబాకు, దారం లాంటి ముడి సరుకులు యాజమాన్యమే అందివ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు వేతన స్లిప్పులు ఇవ్వకపోవడంతో నెలలో వారికి వేతనం ఎంత వస్తుందో తెలియడం లేదన్నారు.
బ్యాంకులో డబ్బులు తెచ్చుకునే సందర్భంలో అయోమయానికి గురవుతున్నారన్నారు. వెంటనే కార్మికులందరికీ వేజ్ స్లిప్స్ అందివ్వాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల విషయమై యాజమాన్యంతో సాయంత్రం వరకు చర్చలు కొనసాగుతున్నాయి. సానుకూల నిర్ణయం రాకపోతే ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న, ఐ.ఎఫ్.టీ.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తన్న, ఎం.సుధాకర్ యూనియన్ నాయకులు డి.కిషన్, బి.మల్లేష్, సాయన్న, బి.మురళి, మల్లవ్వ, భారతి, లలిత, అమూల్య, సావిత్రి, స్వప్న, జమున, లక్ష్మి, సుధారాణి, బీడీ కార్మికులు పాల్గొన్నారు.