నిజామాబాద్, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన వైజాగ్, పాడేరు, అరకు తదితర ఏరియాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపాదడపా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు.
గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అదేవిధంగా కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వలను వెలికితీయాలని, ఈ దిశగా, పోలీస్, ఎక్సయిజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ హితవు పలికారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి అలవాటుపడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని ఆ వ్యసనం మానుకునేలా డీ-అడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని అన్నారు. కాగా, గడిచిన 2023 సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది గంజాయి కేసులు కొంతవరకు తగ్గాయని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వివరించారు. ఎక్సయిజ్ శాఖతో సమన్వయం పెంపొందించుకుని మత్తు పదార్థాలు రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా పోలీస్ శాఖ తరపున కృషి చేస్తున్నామని తెలిపారు.
సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, ఆర్టీసీ ఆర్.ఎం జానీరెడ్డి, డీఐఈఓ రవికుమార్, అటవీ, రవాణా, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.