నిజామాబాద్, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించగా, నగర మేయర్ నీతూకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని కులమతాలకు చెందిన సంప్రదాయాలు, పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. మహోన్నతమైన రామాయణ గ్రంథాన్ని అందించిన మహాకవి వాల్మీకిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దుర్గుణాలను విడనాడి, సద్గుణాలను అలవర్చుకోవాలని, సమాజ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వాల్మీకి రచించిన రామాయణంలోని ప్రతి ఘట్టం నైతిక, సామాజిక విలువలను ఉపదేశిస్తుందని, కుటుంబ బంధాలు, సుపరిపాలన వంటి అనేకానేక అంశాలను బోధిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రమేష్, నర్సయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, వాల్మీకి సంఘం అధ్యక్షుడు నరేష్, బీ.సీ సంఘాల నాయకులు బుస్సా ఆంజనేయులు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.