కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం ముదోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెద వర్గాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించడం జరుగుతున్నదని, వాటిని సక్రమంగా అందించాలని అన్నారు.
చిన్నారులకు ఆటపాటలు, విద్యాబుద్దులు నేర్పించాలని తెలిపారు. కేంద్రంలో 25 మంది పిల్లలను నమోదు చేయగా 17 మంది మాత్రమే అటెండెన్స్ ఉందని, మిగతా పిల్లలను కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఆరోగ్యవంతంగా లేని పిల్లలకు బాలామృతం అందించాలని తెలిపారు. పోషకాహార లోపం కలిగిన పిల్లల్ని స్థానికులు దత్తత తీసుకొని న్యూట్రిషన్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు , వంట గదులను కలెక్టర్ పరిశీలించారు.
అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రానికి రాని పిల్లలను వచ్చే విధంగా వారి పోషకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సిడిపివో, సూపర్వైజర్లతో అన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా లేవని, వాటిని శుభ్రపరచాలి ప్రిన్సిపాల్ కు తెలిపారు.
గతంలో పాఠశాలల్లో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, సి.డి. పి. ఒ. స్వరూప రాణి, సూపర్వైజర్ వినోదిని, మండల విద్యాధికారి, తదితరులు పాల్గొన్నారు.