కామారెడ్డి, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్కు అవగాహన, క్విజ్ పోటీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడంతో పాటు, తోటీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు, ఇరుగుపొరుగు వారికి తెలియపరుస్తూ అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ లను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని వివిధ 61 పాఠశాలల్లో 122 మంది అంబాసిడర్స్ లను నియమించడం జరిగిందన్నారు. ప్రతీ ఒక్కరికీ డ్రైవింగ్ రూల్స్ తెలియడం వలన ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు అన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, జిల్లాలో 520 గ్రామాలుండగా గత సంవత్సరం సుమారు 500 లకు పైగా ప్రమాదాలు జరిగాయని, ప్రతీ రోజూ ప్రతీ ఒక గ్రామంలో ప్రమాదం జరిగినట్లు అవగతం అవుతున్నదని అన్నారు.
జిల్లాలో రెండు జాతీయ రహదారులున్నాయని, ప్రతీ వాహన చొదకుడు అప్రమత్తంగా వాహనాలను నడిపించాలన్నారు. ప్రమాదాలు చేసినవారికి కొత్త చట్టం ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. రోడ్డు భద్రతా కార్యక్రమాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో 61 పాఠశాలల్లోని 122 మంది విద్యార్థులను అంబాసిడర్స్ గా నియమించడం జరిగిందని, ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, డిఎస్పీ నాగేశ్వర్ రావు, పోలీసు అధికారులు, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.